top of page

జాగృతి మాలిక 10

  • Writer: Admin
    Admin
  • 6 days ago
  • 2 min read


బ్రహ్మదేవుడు మన తలరాతలను రాస్తూనేవుంటాడా?


ఎంతో కష్టపడుతూనేవున్నా నా సంపాదన ఎక్కడవేసిన గొంగళి అక్కడే మాదిరిగానే అంతంత మాత్రమే! మరి ఈ కుటుంబాన్ని, రోజు రోజుకు పెరుగుతున్న అవసరాలను ఎలా తీర్చాలి. బహుశా నేనే దురదృష్టవంతుడిని, ఆ బ్రహ్మదేవుడు నాతలరాతని ఇలాగే వుండాలని రాసేసాడేమో? నైరాశ్యం, నిస్సహాయతలతో మనస్సులో తీరని ఈ ఆవేదనతో ఉంటే అది మిమ్మల్ని మరింత నిస్సహాయలుగా చేస్తుంది, వాటినుంచి బయటపడాల్సిందే! ఈ సవాళ్లను ఎదుర్కొనే స్థైర్యం కోసం ఆ బదేవుడినే వేడుకోవాలి!


దారిద్ర్యంలోనే పుట్టా, దరిద్రపు బతుకే నాది! బికారిగానే ఎందుకు ఉండాలి, బహుశా దేవుడికి నేనంటే ఇష్టం లేదేమో అని దేవుడు మీద నెపంవేస్తే నీకు ఒరిగేది ఏమీలేదు, నీ లోని సోమరితనాన్ని పక్కనపెట్టి సానుకూలంగా ముందడుగు వేయాల్సిందే!


వాడికి అన్నీ సమకూరుతున్నాయి, మరి నాకు ఆ విధంగా ఎందుకు కావడం లేదు అనే తీరని అసంతృప్తి,దేవుడు నన్నే ఎందుకు ఇలా ఉపేక్షిస్తున్నాడు? ఈ అసంతృప్తి భావన నుంచి ముందు బయటికి రావాల్సిందే!


నేను వాడి కంటే బాగా చదువుతాను, కానీ వాడికే మంచిమార్కులు అన్ని వస్తుంటాయి.బహుశా ఆ దేవుడికి నేనంటే చిన్నచూపేమో? ఈ నూన్యత భావననుమనస్సు పొరల్లో నుంచి తొలగించుకోవాల్సిందే!


వాడికి పట్టిందల్లా బంగారం, మరి నాకేమో కాకి బంగారం! వాడు అదృష్టవంతుడు, ఎదుగు బొదుగులేని జీవితమే నాది. దేవుడు ఎందుకు నన్నే ఇలా శిక్షిస్తున్నాడు? ఈ అసూయ నుంచి అనసూయగా మారాల్సింది నీవే!


ఇది నాకర్మ గాకపోతే కడుపునిండా తింటున్నా రోగిష్టిగానే ఎందుకువుండాలి? కర్మ అని సరిపెట్టుకోవడం కాదు,బలవర్ధకమైన హితాహారం, మితాహారం, సాత్వికాహారంని తీసుకోవడం ఆరంభించాలి.


తను అందచందాలతో ఆకర్షనీయంగా వుంటే, మరి నాకెందుకు ఈ వికారరూపం.

ఆ భగవంతునికి ఎందుకు మామీద ఇంతటి వివక్ష? మనలోని ప్రజ్ఞ, మేధస్సులే తరగని అందాలు. వాటిని మెరుగు పరచుకుంటువుంటే అదే సుందర రూపం అవుతుంది.


నిజానికి కష్టాలు, సమస్యలు, ఒడిదుడుకులు భగవంతుడు ఇచ్చిన సవాళ్లుగా స్వీకరించాలి, ఆ సవాళ్లను ఎదుర్కొనే శక్తి కోసం ఆ భగవంతుడిని అంకితభావం, సమర్పణ భావన, అనన్యభక్తిశ్రద్దలతో,నిర్మలచిత్తంతో వేడుకోవాలి.


భగవంతుడు ఎవ్వరినీ ద్వేషించడు

భగవంతుడు ఎవ్వరినీ శిక్షించడు

భగవంతుడు ఎవ్వరినీ ఉపేక్షింపడు

భగవంతుడు ఎవ్వరినీ శపించడు

భగవంతుడు ఎవ్వరిపై వివక్ష చూపించడు

భగవంతుడు ఎవ్వరిపై అయిష్టంగా వుండడు

భగవంతుడు ఎవ్వరిపై కోపం చూపించడు

భగవంతుడు ఎవ్వరినుంచి ఏమి ఆశించడు


సాక్షాత్తు పరబ్రహ్మనే భగవంతుడు,

ఆయన సృష్టి, స్థితి, లయ కారకుడు.

భగవంతుడు శరణు కోరినవారినే అనుగ్రహిస్తాడు

భగవంతుడు భక్తి, శ్రద్ధలతో ఆరాధించే వారి కోరికలను నెరవేరే అభయహస్తం ఇస్తాడు.

భగవంతుడు కరుణామయుడు.

భగవంతుడు కారుణ్యమూర్తి.

భగవంతుడు దయార్దహృదయుడు.

భగవంతుడు దాక్షిణ్యమూర్తి.

భగవంతుడు కృపానిధి.

భగవంతుడు ప్రేమస్వరూపమే.

భగవంతుడు నిత్య చైతన్యస్వరూపం.


బ్రహ్మదేవుడు ఏవ్వరి తలరాతలు రాయడు! నీ తలరాతలను నీవు స్వయంగా రాసుకున్నదే, రాసుకుంటున్నదే!

భగవత్ ప్రసాదిత ఈ జన్మ నీవు స్వయంగా ఎంచుకున్నదే!

అంకిత భావం, అనన్య దీక్ష, కృషి, పట్టుదలతో నీ తలరాతను సరిదిద్దుకోనే శిల్పివి నీవే కావాలి!


పూర్వ జన్మల్లో చేసుకున్న సంచిత కర్మఫలాలను ఈ జన్మలో అనుభవించి తీరాల్సిందే.

కర్మ ఎవ్వరినీ విడిచి పెట్టదు.


ఈ జన్మలోచేసే కర్మలు,కర్మలచిట్టాగా మీ చిత్తంలో నిత్యంరికార్డు అవుతూ ఆ చిత్తంలోనేగుప్తంగా వుంటాయి. దానినే చిత్రగుప్తుడుచిట్టాగా పిలుచుకుంటాం.అవే మరుజన్మకి మీరుగా రాసుకొనే లలాటలిఖితంగా అవుతాయి.


సత్ సంకల్పం, సద్భావనలతో చేసే జనహితకార్యాలు, పుణ్యకార్యలు, లోకకళ్యాణకారక కార్యాలు, నిష్కామ కర్మలు,విహితకర్మలు మీ ప్రస్తుతపరిస్థితులను మెరుగుపరుస్తూ సంచితకర్మల ప్రభావాన్ని తగ్గిస్తూ మీ జీవితాన్ని సుఖమయం చేస్తాయి.


ఈ రోజే ఓ స్పూర్తివంతమైన నిర్ణయం తీసుకొని విధిగా అమలు పరిచేదిశలో ముందడుగు వేయాలి. ప్రతిరోజూ మనం విధిగా ఆచరించే నిష్కామకర్మలు, ఇతరుల మొహంలో ఓ చిరునవ్వును తీసుకు వచ్చేట్లుగా వుండాలి. మన తలరాతను మనమే తిరగరాసుకోవాలి.


సర్వే జన సుఖినోభవంతు


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

 
 
 

Comentários


bottom of page