top of page

జాగృతి మాలిక 11

  • Writer: Admin
    Admin
  • 6 days ago
  • 2 min read


దృష్టికోణంచేసే మాయ !!


ప్రకృతి అందాలను ఆస్వాదించే దృక్కోణం మనస్సును పరవశమయం చేస్తుంది.


అప్పుడే ఎనిమిది వసంతాలు గడచినప్పటికీ ఆహిమజలాలను, హిమపాతాలను, హిమనదాలను తనతో, తనలో ఇముడ్చుకుని ఆ హిమగిరుల గంభీరతను వీక్షిస్తూ అలవోకగా ముందుకువురికే అలకనంద ఉక్కిరిబిక్కిరి చేసే విన్యాసాల జలకళని, గలగల శ్రవణానందకరంగా పారుతున్న ఆ సౌందర్యలహరి ఆ బదరీనాధుని పాదాలనుసృశిస్తూ వినమ్రంగా చేసే అభి వందనం,ఆ హిమగిరి సొగసులను,లోయలను, తపోవనాలను సృశిస్తూ తనలోకి మందాకిని, నందకిని, భగీరధినీ కలుపుకుంటూ దేవప్రయాగలో గంగానదిలో సంగమించే ఆ సుదీర్ఘ ప్రయాణం మనోరంజకంగా వుండే మధురానుభూతి, నా మనోపలకంలో ఇప్పటికీ సజీవంగానే వుంది.

పారమార్ధిక చింతనతో ఆ సచ్చిదానందమూర్తికి మదిలోసమర్పించే ఆ కృతజ్ఞతాపూర్వక కుసుమాంజలి పరబ్రహ్మకి సమర్పించే హృదయపూర్వక వందనమే అవుతుంది!!!


మనలో భౌతికదృక్పథం, మనోదృక్పథం, ఆధ్యాత్మిక దృక్పథంతో కూడిన దృష్టికోణాలు కలగలిసే వుంటాయి.


భౌతికదృక్కోణం:

ఈ జీవితం అంటే విలాసవంతమైన బంగ్లాలు, విశాలమైన ఏసీ గదులు, సౌకర్యవంతమైన కింగ్ సైజ్ బెడ్స్, మోడరన్ డ్రస్సులు, ఖరీదైనకార్లు, విలువైననగలు, షేర్లు, బాండ్లు, ప్రాపర్టీలు,బ్యాంక్ బ్యాలెన్సులు మాత్రమే!!

ఈ జీవితం ఆంటే లాంగ్ డ్రైవ్ లు, గెట్ టూ గెథర్లు, వీక్ఎండ్ పార్టీలు, పిక్నిక్ లు!!!ఇదేకదా స్వర్గసీమ! ఇంతే కదా జీవితం అనే భ్రమలో వుంటారు.

కేవలం గుర్తింపుకోసం, గౌరవంకోసం దానధర్మాలు, యజ్ఞాలు, యాగాలను కూడా ఆచరిస్తూ వుంటారు.

అంతులేనికోరికలతో, తీరనివ్యామోహలతో, అధర్మం, అనైతికం, అహంకారపూరిత జీవితాన్ని కొనసాగిస్తూ వుంటారు.


మనోదృక్కోణం:

ప్రాపంచికవిషయాలపై భోగ సామాగ్రిపై తగురీతిలో స్పందిస్తూ, ప్రకృతి రమణీయతలను ఆస్వాదిస్తూ, ఆరాధిస్తూ సానుకూల భావోద్వేగాలతో ప్రకృతిలో మమేకం అవుతూ ఆధ్యాత్మిక అనుభూతులతో ప్రశాంత జీవనాన్ని కొనసాగిస్తూ వుంటారు.

సమాజహితాభిలాషలతో నిషిద్ధకర్మలకు త్యజిస్తారు.

లోకకల్యాణం కోసం యజ్ఞక్రియలు, పుణ్యకర్మలు సత్కర్మలను ఆచరిస్తూవుంటారు.

లభించినవాటితో సంతోషంగావుంటూ రానివాని కోసం తాపత్రయంచూపించరు.

గుర్తింపు,గౌరవంల కోసం తాపత్రయపడరు.

సుఖ దుఃఖాలు, కలిమిలేములు పడిలేచే కెరటాలుగా వీక్షిస్తారు.


ఆధ్యాత్మికదృక్కోణం:

మనోనేత్రంతో సర్వత్రా విస్తరించియున్న ఆ సర్వాంతర్యామిని దర్శిస్తూ అంతర్యామితో స్థితమై అలౌకిక ఆనందానుభూతితో పరవశిస్తూ వుంటారు.ఇది శుద్ధచైతన్య స్వరూపంతో అంతరంగం ప్రకాశవంతంగా, తేజోమయంగా వికసించి వుంటుంది.

ఈ అంతరంగం భక్తిమయం. వారు ఆచరించే కర్మలన్ని దైవకర్మలే!!


భక్తిభావనతో చేసేవంట యజ్ఞక్రియ అవుతుంది

భక్తిభావనతో భగవంతునికి సమర్పిస్తే అదే నైవేద్యం అవుతుంది.

భక్తిభావనతో స్వీకరిస్తే అదే ప్రసాదం అవుతుంది.

భక్తిపూర్వకంగా సమర్పించిన తోయం తీర్థం అవుతుంది.

భక్తితో వెలిగించే దీపప్రజ్వలన దీపహారతి అవుతుంది.

భక్తితో వెలిగించే అగరుబత్తి ధూపసేవ అవుతుంది.

భక్తి శ్రద్ధలతో చేసే గీతాఆలాపన స్వరార్చన అవుతుంది.

భక్తి శ్రద్ధలతో చేసే స్మరణ అర్చన అవుతుంది.

భక్తి శ్రద్ధలతో చేసే సేవ మాధవసేవ అవుతుంది.

భక్తి శ్రద్ధలతో చేసే కర్మలు దైవ కర్మలు అవుతాయి.

భక్తి శ్రద్ధలతో వీక్షిస్తే సర్వం పరాప్రకృతి అవుతుంది

జీవితం అనే సముద్రంలో కొందరికి ముత్యాలు

మరి కొందరికి జలపుష్పాలు

మరి కొందరికి ముత్యపుచిప్పలు

మరికొందరికి నత్తగుళ్లలు

మరికొందరికి సముద్రపు గవ్వలు

మరికొందరికి నునుపుగా, సొగసుగా వుండే గులకరాళ్ళు లభిస్తాయి.


మరికొందరికి ఉదయిస్తున్న సూర్యుడు ఆ జగన్మాత నుదుటి సిందూరం అవుతుంది.

మరికొందరికి జీవప్రదాతగా సదా జీవశ్రేయస్సునీ ఆకాంక్షించే అనంతజలరాశిగా మనోవిక్షణంలో ప్రతిఫలిస్తూ వుంటుంది.


మరికొందరికి కేవలం అలలతాకిడి ఘోష

ఇంకొందరికి శూన్య హస్తాల అనుభవం కూడా

వుంటుంది. అదే దృష్టికోణం చేసే మాయ.


మనం చూసే ఆ దృష్టికోణం ఈ అద్భుతసృష్టి ని వీక్షించేవిధంగా మీమనస్సునీ ప్రభావితం చేసే విధంగా వుంచుకోవాలి.

బురదలో పుట్టినా పరిమళాలను నలువైపులా వెదజల్లే కమలంలా,మన మనస్సుకూడా వికసించాలి !!


సర్వే జన సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక సేవలో

మీ

RaNa

9900022729

🧘‍♀️🧘🧘‍♂️🧘‍♀️🧘🧘‍♂️🧘‍♀️

 
 
 

Comments


bottom of page