జాగృతి మాలిక 33
- Feb 10
- 3 min read
ఒత్తిడి…ఆందోళన రెండూ ఒకటి కాదా ?
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మారుతున్న జీవనశైలి, పనిలో ఒత్తిళ్లు మరియు ఇతర సవాళ్లకు శరీరం మరియు మనస్సు ఇచ్చే సహజ ప్రతిస్పందనే స్ట్రెస్, అదే ఒత్తిడికి మూలం.
వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కుంటున్న సమస్య టెన్షన్, ప్రెషర్,ఒత్తిడి.
* ఓ చిన్నారి హోంవర్క్ పూర్తి చేయలేకపోతే పడేది టెన్షన్
* సకాలంలో పని పూర్తిచేయకపోవడంతో వచ్చేది వర్కుప్రెషర్
* వ్యాపారంలో తగినంత ఆదాయం లేకపోవడంతో కలిగేది ఒత్తిడి
* ట్రాఫిక్ లో చిక్కుకొని సకాలంలో ఆఫీసుకు చేరుకోలేకపోతే కలిగేది అసహనం
* పనిచేస్తునేవున్నా ఇంకా పూర్తికాని పనులతో సతమతమయ్యే ఇల్లాలు
* ఎన్ని గంటలు పని చేసినా తెమలని పనులతో నిస్పృహతో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి
* ఫైనల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ విద్యార్థులు పడేది ఆందోళన.
* అనుకున్న టార్గెట్ చేరుకోలేకపోతే ఎలా ? భయంతో కూడిన ఉద్వేగం.
* స్కూలు నుంచి పిల్లలు ఆలస్యంగా వస్తే తల్లి పడేది భయంతో కూడిన అభద్రత.
ఒత్తిడి, టెన్షన్,ప్రెషర్, ఆందోళననాలు కూడా జీవితంలో అవసరమే, అవి మనలోని ప్రతిభను వెలికితీస్తాయి.
* పరీక్షలకోసం ప్రిపరేషన్స్ వారిని మరింత జాగ్రత్తగా చదువుకునేలా చేస్తుంది.
* హోమ్ వర్క్ చేసే విషయంలో చిన్నారికి పట్టుదలను పెంచుతుంది.
* వ్యాపారంలో ఒత్తిడి మరింత కష్టపడే స్వభావాన్ని పెంచుతుంది.
* పనిలోని ఒత్తిడి పట్టుదలతో సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరణ కలిగిస్తుంది.
* అనారోగ్యం జీవితాన్ని దుఃఖమయం అనే భావన ఆరోగ్యవంత జీవనానికి ప్రేరణ అవుతుంది.
* సంతోషకర జీవితం కోసం విద్యార్థిలో కష్టపడే మనస్తత్వానికి కారణ మవుతుంది.
* పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు చేసే ప్రతి పనిలో అంకితభావానికి కారణం అవుతుంది.
ఒత్తిడి, ఆందోళన,ఉద్వేగం,టెన్షన్ లు మన ఆధీనంలో ఉంటే ప్రోత్సాహకర ఫలితాలే వస్తాయి!నీవు వాటి కంట్రోలులో ఉంటే మానసిక వేదనకు గురయ్యే ప్రమాదం ఉంటుంది!
పనిలోని ఒత్తిడి ఆ పని పూర్తవగానే మనస్సు తేలిక పడుతుంది, అలాగాకుండా ఆందోళనతోనే ఉంటే అది మనస్తాపానికి దారితీస్తుంది. అటువంటి నియంత్రణలో లేని ఒత్తిడి నిరాశ, నిస్తేజం,నిద్రలేమి,అధికంగా తినడం లేదా ఆకలి లేకపోవడం, శక్తి లేకపోవడం వంటి అనేక శారీరక మరియు మానసిక సమస్యలకు దారితీస్తుంది.
ఒత్తిడి అనేది సవాళ్లకు ప్రతిస్పందనగా శరీరం మరియు మనస్సు అనుభవించే మానసిక వేదన లేదా భావోద్వేగ విపత్తు. శరీరం ఒత్తిడికి ప్రతిస్పందించే తీరు ఆందోళన. ఇది అతివిచారం లేదా అతిదుఃఖంగా అగుపిస్తుంది. ఇందుకు మారిన జీవనశైలి, పని ఒత్తిళ్లు, బంధాలు దూరం కావడం, బంధాలను కోల్పోవడం వంటి అనేక కారణాల కలబోతగా కలసి ఉండవచ్చు.
ఒత్తిడి లేని ఆందోళనే ఉండదు.
ప్రతి రోజూ ఎదురయ్యే శారీరక,మానసిక ఒత్తిడులు,ఆందోళనలు, ఆరోగ్య సమస్యలు, ఆర్ధికఇబ్బందుల భావోద్వేగాల విపత్తును సమర్థవంతంగా స్వీకరించే సానుకూల భావనలతో మనస్సును సంసిద్ధం చేయడానికి ఓ నిర్దిష్ట ప్రణాళికగా యోగాను ఈ నవీన సమాజం గుర్తించింది.
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రపంచంలో అన్నిదేశాలు యోగ ప్రాధాన్యతను తమదేశ ప్రజలకు తెలియజేస్తున్నాయి, సామూహిక యోగ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నాయి.
యోగ అంటే ఏమిటి? యోగ మానసిక ఒత్తిడి ఆందోళనలను నియంత్రించే ప్రభావశీలినా?!
యోగ అంటే మానసిక ప్రశాంతతకు వేదిక
యోగ అంటే సమస్యలను సవాళ్లుగా స్వీకరించే సానుకూల దృక్పథం
యోగ అంటే అనారోగ్యాలను దూరం చేసుకునే విధానం
యోగ అంటే మెరుగైన, నాణ్యమైన శ్వాసక్రియాచరణ
యోగ అంటే ఉద్విగ్నరహిత ఆలోచన సరళి
యోగ అంటే లక్ష్యసాధనలో దృఢసంకల్పం
యోగ అంటే ఉత్కృష్టమైన లక్ష్యసిద్ధి
యోగ అంటే మెరుగైన జీవన విధానం
యోగ జీవన విధానం కాలంతో పాటుగా చైతన్యవంతంగా మిమ్మల్ని ప్రభావితం చేస్తూ ముందుకు నడిపేది, నడిపించేది.
యోగ సాధన నూతనఉత్తేజాన్ని, ప్రశాంతతను తీసుకురావడంలో అత్యంత ప్రభావశీలి.
యోగాసనాలు, యోగ క్రియలు, ధ్యానం, ప్రాణాయామలతో సంక్లిష్టమైన ఆందోళనలకు కారణమయిన మానసిక , శారీరక స్థితిగతులను సమర్థవంతం నియంత్రించే సరళీకృత విధానం.
ప్రతిఒక్కరూ వయస్సుతో నిమిత్తం లేకుండా ఉదయం లేదా సాయంకాలం సమయాల్లో మీ అనుకూలతను బట్టి చేయదగిన సరళమైన ప్రాథమిక ఆసనం, విశ్రాంతి ఆసనం లేదా విరామ ఆసనంగా వాడుకలో వ్యవహరింపబడే శవాసనం. మానసిక విశ్రాంతి, శారీరక విశ్రాంతిల కోసం ఉపయుక్తమైన ఈ ఆసనం ఇలా చేయాలి.
* యోగ మ్యాట్ పై వెల్లకిలా చేతులు, కాళ్లు సాచి ముఖం ఆకాశంకేసి చూస్తున్నట్లుగా కన్నులు మూసుకొని పడుకోండి. ప్రకృతి ప్రసాదిత ప్రాణధాతు రూపం ఆక్సిజన్ ను ధారాళంగా లోతైన ఉచ్చాస్వగా తీసుకుంటూ శ్వాసకోశాలు మరియు సర్వాంగాలు ఆ ప్రాణదాతువులో పులకిస్తున్న భావనతో నెమ్మదిగా శ్వాసను తీసుకోవాలి.
* ప్రతి నిశ్వాసను నెమ్మదిగా నాభి దిగువనుంచి శరీరంలోని గ్యాసులను, టాక్సిన్లను బయటకు వదిలివేస్తున్న భావనతో సుదీర్ఘ నిశ్వాసక్రియగా కొనసాగించాలి.
* శ్వాస మీద ధ్యాసతో కేవలం ఉచ్ఛాస్వ నిశ్వాసల గమనాన్ని పరిశీలించండి.
* మనలో కొందరు శ్వాసను దీర్ఘంగా లోనికి తీసుకోగలరు, మరికొందరు దీర్ఘ నిశ్వాస తీసుకోగలరు. అయితే శ్వాస తీసుకునే వ్యవధి, నిశ్వాసల వేగాన్ని క్రమేణా తగ్గించడం ప్రధానం.
* మనస్సు, శరీరంను తేలిక అవుతున్న అనుభూతితో పది నిమిషాలు భావోద్వేగ రహితంగా ఆసన సాధనను కొనసాగించాలి.
నెమ్మది నెమ్మదిగా శ్వాసవేగాన్ని నియంత్రించడంతో మనస్సులో అలజడులు క్రమేణా తగ్గుముఖం పడతాయి. అందుకు యోగిక్ శ్వాస క్రియను 4:4:6 ను ప్రాక్టీస్ చేయండి. ఆరంభంలో 4 సెకన్లు ఉచ్ఛాస్వ తీసుకోవాలి, 4 సెకన్లు శ్వాసనీ బంధించాలి (కుంభకం) ఆ తరువాయి 6 సెకన్లు నిశ్వాస ద్వారా శ్వాసను వదలాలి. ఓ పది వారాలలో 5:5:8 స్థాయికి చేరుకునే విధంగా అభ్యాసం చేయాలి. ఈ శ్వాసనియంత్రణ పలితంగా శ్వాసకోశాలు తేజోవంతం అవుతాయి, శరీరంలోని టాక్సిన్లు, వ్యర్థాలు బయటకు పోవడం ద్వారా జీర్ణక్రియ,జీవక్రియ,జీవితక్రియల నాణ్యత మెరుగవుతూ మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మానసిక అలజడులపై నియంత్రణవస్తూ మనస్సు ప్రశాంతతకు చేరువవుతుంది.
* సుఖాసనం లేదా పద్మాసనం లేదా అర్ధపద్మాసనం లేదా వజ్రాసనంలలో మీకు సౌకర్యవంతమైన ఆసన స్థితిలో కూర్చుని శ్వాస నియంత్రణ ఆధార విశ్రాంతి ఆసనసాధన చేస్తే అదే ప్రాణాయామం అవుతుంది.
* ఇది ప్రాణశక్తిని మెరుగైన, నాణ్యమైన యోగిక్ శ్వాసక్రియా ద్వారా ఉత్తేజభరితం చేస్తుంది.
* నేల మీద కూర్చోలేనివారు కుర్చీలో సౌకర్యవంతంగా కూర్చుని ప్రాణాయామం సాధన చేయవచ్చు. అనారోగ్యంతో అశక్తులైనవారు బెడ్ మీద నుంచి శవాసనం వేయడం అభిలషణీయం.
ఈ సాధన ఆరుబయట ఉషోదయ వేళల్లో కొనసాగిస్తే చక్కటి ప్రాణవాయువుతో మనువు,తనువు పరవశిస్తుంది. అపార్ట్మెంట్లలో వుంటే ధారాళంగా వెలుతురు, గాలి ప్రసరించే గదిలో చేయడం శ్రేయస్కరం.
మనలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడేవారే .
* అటువంటి వారు ప్రతిరోజూ శవాసనం నిద్రకు ఉపక్రమించే ముందు ఓ పావుగంట సేపు శ్వాస మీద ధ్యాసతో మీ ఇష్టదైవమైన ఆ పరమాత్మకు కృతజ్ఞతాపూర్వక స్మరణతో అభ్యాసం చేయండి.
* ఈ ఆసనంలో మీ తల,మెడకి ఆసరాగా మెత్తటి పలుచటి తలదిండుతో నిద్రలోనికి నెమ్మదిగా జారుకోండి అది మెడనొప్పుల నుంచి ఉపశమనం తెస్తూ సుఖనిద్రకు కారణం అవుతుంది.
* వెన్నునొప్పి ఉంటే రెండు మోకాళ్లుకు దిగువున ఆసరాగా మెత్తటి దిండు ఉంచడం ద్వారా వెన్నునొప్పి సమస్య నుంచి ఉపశమనంతో మంచినిద్ర లభిస్తుంది.
* పక్కకు తిరిగి పడుకునే అలవాటు ఉంటే రెండు మోకాళ్ల మధ్య మెత్తటి దిండు ఆసరాతో వెన్ను సమతుల్యతను కాపాడుతూ నిద్రలేమి నుంచి ఉపశమనం పొందండి.
ఇదే ఆసనం బోర్లా పడుకుని లోతైన దీర్ఘ ఉచ్ఛాస్వ, నిశ్వాసలతో నెమ్మదిగా కొనసాగిస్తే అది మకరాసనం అవుతుంది. మానసిక, శారీరక విశ్రాంతి కోసం ఈ ఆసనం ఉపయోగపడుతుంది.
మనశ్శాంతి అనేది బయటనుంచి వచ్చేది కాదు. దూరం పెట్టాల్సిన వాటిని దూరం పెడితేనే వస్తుంది. పట్టించుకోవాల్సినదానిని మాత్రమే పట్టించుకోవాలి.

Comments