top of page

జాగృతి మాలిక 37

  • Feb 10
  • 2 min read

జీవితం


అతి దుర్లభం అయిన ఈ మానవజన్మ అప్రమేయుడు, సర్వేశ్వరుడు అయిన పరమాత్మ మనకు ఎన్నోజన్మల నిరీక్షణ ఫలంగా ప్రసాదించిన అపురూప కానుక!

అవ్యక్తం, అచింత్యం నుంచి ఈ జన్మ తీసుకుని శిశువుగా జీవితం ప్రారంభించి అమ్మ నాన్నల ప్రేమామృతం గ్రోలుతూ బాల్యం,కౌమారం,యవ్వన దశలను దాటుకుంటూ యుక్త వయస్సులో జీవితభాగస్వామితో వివాహబంధంతో అగ్ని 🔥 సాక్షిగా ఒక్కటి అవుతాం.

వైవాహిక జీవితమధురిమలను పరస్పర అనురాగంతో ఆస్వాదిస్తూ, వంశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ పిల్లలను కనడం వారికి ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పోషించి ప్రయోజకులుగా తీర్చిదిద్దడం కోసం జీవితాన్నీ ఫణంగా పెడతాం.

నెమ్మదిగా వృద్ధాప్యదశలోనికి అడుగుపెడుతూ గమ్యం తెలియని దిశలో తిరిగి అవ్యక్తం, అచింత్యం లోనికి ప్రయాణం కొనసాగిస్తూ ఇంకో జన్మ తీసుకోవడానికి సంసిద్ధం అవుతాం.

ఈ జీవనప్రక్రియ, జీవితానుసంధానంతో కొనసాగే జీవనగమనంలో ఎన్నెన్నో మలుపులు, ఒడిదుడుకులు, పరిచయాలు, స్నేహబంధాలు , అనుభవాలు, అనుభూతులు,భావోద్వేగాలతో కూడిన సజీవసంగమంగా, ముందుకు పయనించే జలధారగా కొనసాగుతూ ఏదో ఒక రోజు అంతర్ధానం అవుతుంది.


జీవితం అంటే అప్రమేయుడితో కొనసాగే జన్మాంతర అనుబంధం

జీవితం అంటే విశ్వంభరుడితో అనుభంద ఆకాంక్ష

జీవితం అంటే ఋణానుభందం

జీవితం అంటే కొన్ని మధుర జ్ఞాపకాలు

జీవితం అంటే భావోద్వేగాల కడలి

జీవితం అంటే అనుభవాల దొంతర

జీవితం అంటే కలిమి లేముల కావడి

జీవితం అంటే రాగద్వేషాలు.

జీవితం అంటే కష్టసుఖాల ఒరవడి

జీవితం అంటే నేను, నాది, నీవు, నీది అనే ద్వైత్వభావన

జీవితం అంటే తండ్రి కొడుకుల మధ్య వుండే ప్రేమానుభందాలు.

జీవితం అంటే భార్య భర్తల మధ్య వుండే నమ్మకం, అనురాగం.

జీవితం అంటే అన్న,తమ్ముల్ల మధ్య వుండే విశ్వాసం,మమకారం.

జీవితం అంటే తోబుట్టువుల మధ్య వుండే అనురాగ, ప్రేమ బంధం.

జీవితం అంటే కష్టసుఖాలలో కూడా తోడునీడగా వుండే స్నేహబంధం.

స్నేహమేరాజీవితం స్నేహమేరాశాశ్వతంగా ప్రతిఫలం ఆశించకుండా కేవలం నీ శ్రేయస్సు, భవిష్యత్తును ఆకాంక్షించే మంచి మిత్రుడితో స్నేహం కలకాలం కొనసాగించడమే !!


కాలంలో జన్మించడం, కాలంలో పయనించడం, కాలంలో కలిసిపోవడమే జీవితం.

ఆది అంతం తెలియని ఈ కాలచక్రంలో అవ్యక్తం నుంచి వ్యక్తమవుతూ తిరిగి అవ్యక్తంలో కలిసిపోయే ఆత్మ తన నిరంతరప్రయాణంలో అసంఖ్యాకమైన జన్మలను తీసుకుంది ,తీసుకుంటుంది, తీసుకోబోతుంది ఇది చర్వితచరణం. సృష్టి ఆరంభం నుంచి ఆత్మ తన పయనం ఇలా నిరంతరం కొనసాగిస్తూనే ఉంది.

ఈ జీవిత ప్రయాణం చాలా చిన్నది అయితే విలువైనది,అమూల్యమైనది. అందుకే ఈ జీవితాన్ని జీవకళతో ఆస్వాదించాలి.అందుకోసం:

* సంతోషం కోసం పరితపించడం కాదు, అది మార్కెట్టులో దొరికే వస్తువు కాదు, అది మనం చేసే పనులలో, కార్యకర్మలలో,ఆలోచనలలో ప్రతిఫలిస్తుంది అనే సత్యం తెలుసుకోవడం

* నీవు ఏ క్షణం నుండి ఎదుటివారి మంచిని మనఃపూర్తిగా కోరుకోవడం ప్రారంభిస్తావో ఆ క్షణం నుండి మనస్సులో ఆనందం చిగురిస్తుంది.

* బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి . మన తప్పిదాలకు మనఃపూర్వకంగా క్షమాపణ కోరాలి,అది మెరుగైన మానవీయ సంబంధాలతో సంతోషం పరిమళిస్తుంది.

* జీవితమంటే మనస్సును బుజ్జగిస్తూ, నచ్చచెపుతూ బ్రతకటం కాదు మనస్సుకు నచ్చేలా బ్రతకడం,జీవించడం.

* కోపం వచ్చిన ఒక్క క్షణం మనస్సుని నిగ్రహించుకుంటే పశ్చాత్తాపంతో కుమిలిపోయే వంద క్షణాలను ఆదా చేసుకోవచ్చు.

* జీవితంలో అవమానంను నుంచి నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే స్థైర్యం, అంతేకానీ తిరిగి అవమానించే గుణం కాదు.

* జీవితం కష్టాలలో ఉన్నప్పుడు కృంగిపోవడం కాదు, కష్టాలకు ఎదురు నిలబడి ముందుకు ధైర్యంగా సాగించే పయనం.

* ఇతరులను మెప్పుకోసం చేసేపనులు అసంతృప్తికి కారణ మవుతాయి,అందుకని మనస్సు కోరిన విధంగా కర్తవ్యకర్మలు ఆచరించు. మనస్సు ప్రశాంతతో పులకరిస్తుంది.

* ధర్మం కోసం నీతితో జీవించు. ఆ నిజాయితీ నిన్ను అజాతశత్రువును చేస్తుంది, విశ్వంభరుడికి దగ్గర చేస్తుంది.

* సత్యం కోసం జీవించు, ధర్మం నిన్ను రక్షిస్తుంది. మంచి కోసం జీవించు, మానవత్వం నిన్ను కాపాడుతుంది. అంతర్యామి ఉపద్రష్టగా నిన్ను దరి చేర్చుకుంటాడు.

* ఈ ధర్మం పాటించడం క్లిష్టతరం,నావల్లకాదు అని ఆలోచించే బదులు ఈ అవకాశం మళ్లీ రాదేమో కదా అని అనుకుంటే అదే ఇష్టంగా సత్ఫలితాలను ఇస్తుంది.

* మనస్సు, బుద్ధి, వివేకం మంచిగా ఉంటే జీవితంలో ప్రతిరోజు విలువైనదే, మంగళకరమైనదే. మంచిరోజు ఆనందదాయకం, చెడురోజు అనుభవం అవుతుంది , కష్టమైనరోజు పాఠం అవుతుంది.ఇష్టమైనరోజు జ్ఞాపకంగా మిగులుతుంది. భవిష్యత్తు ఆశాజనకం అవుతుంది.

* జీవితంలో భయపడవలసింది అనివార్యమైన మరణం గురించి కాదు, ఆలోపుగా ఏమీ సాధించలేకపోవడాన్ని గురించి!!

మీ ఆలోచనలు పంచుకుంటే అవి తెరచి ఉంచిన పుస్తకంలా ఇతరులకు ఆదర్శప్రాయం కావచ్చు ,మీ ఆలోచలు పంచుకోలేకపోతే అవి మూసి వుంచిన పుస్తకంలా నిష్ప్రయోజనం కావచ్చు.


సర్వేజనా సుఖినోభవంతు

మీ

ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️ 🧘‍♀️

 
 
 

Comments


bottom of page