top of page

జాగృతి మాలిక 38

  • Feb 10
  • 3 min read

లలాట లిఖితా రేఖా పరిమాష్టుం న శక్యతే


విధాత వ్రాసిన నుదుటిగీత తప్పించుకోవడం ఎవ్వరి వశంకాదు అనే నమ్మకం కొందరిది అయితే, మరికొందరు ఇది మూఢనమ్మకం , విధాతకు మన విధివ్రాతలు రాసేంత టైమ్ ఎక్కడవుంటుంది అని కౌంటర్లు వేస్తూవుంటారు.

గతజన్మలలోని కర్మఫలాలు ఈ జన్మకి ప్రారబ్ధకర్మఫలాలవుతాయి. వాటి నుంచి ఎదురయ్యే కష్టాలను, దుఃఖాలను, పేదరికంను, అనారోగ్యాలను,వేదనలను ఈ జీవనప్రయానంలో అనుభవించి తీరాల్సిందే…ఇవి లేని జీవితం ఊహించలేము…

ఈ లోకంలో కష్టాలు, ఇతిబాధలు, విధివ్రాతల నుంచి ఎవరు తప్పించుకోలేరు అనే నమ్మకం మనందరిలో ఉంటుంది.

ఐతే ఎవరు వీటిని సవాళ్లుగా స్వీకరించి మనోధైర్యంతో ముందడుగు వేస్తారో వారు ఆ కష్టాలఊభి నుంచి బయటకు రావడానికి, విజయంసాధించడానికి విధాత అభయహస్తం వారికి లభిస్తుంది.


హైందవ సంస్కృతీ ఈ విశ్వంను మూడులోకాలుగా విస్తరించినా అఖిలాండ బ్రహ్మాండం అని విశ్వసిస్తుంది. అవి స్వర్గం, నరకం, మర్త్యలోకాలు. కర్మఫలాభిలాషులకు వారి కర్మఫలాల పలితంగా మరణానంతరం యాతనాశరీరంతో తన లోకంలోనికి పయనించి తీరుతుంది. ఇదే విషయంను అప్రమేయుడు అయిన పరమాత్మ గీతలో కర్మఫలం అనుభవించడానికి సిద్ధం కండి అని ‘అనిష్ట మిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణ ఫలం…’ అని హెచ్చరించారు.


స్వర్గం

ఇది పుణ్యలోకం. పుణ్యాత్మల లోకం. స్వర్గంలో దుఃఖం ఉండదు.

* సంతోషభరితం, ఆనందభరితం, అది దేవతలు, పుణ్యాత్మల ఆవాసం.

* ఆకలిదప్పికలు, ఇతి భాదలు లేని సుమధుర మనోహర సుందర సుఖలోకం.

* అందరూ తపించేది, కోరుకొనేది, ఇష్టపడేది, ఆకాంక్షించే ఉత్తమలోకం స్వర్గం.

* జీవితంలో ఆచరించిన పుణ్యకర్మల ఫలితంగా మాత్రమే సిద్ధించేది.

స్వర్గలోకానికి వీసా మనం చేసే దానధర్మాలు, యజ్ఞాలు, వ్రతాలు, పూజలు, దీక్షలు, స్మరణం, మానవసేవ, పాప ప్రక్షాళనలో భాగంగా పుణ్యతీర్థాలు,పుణ్యక్షేత్రాల దర్శన, అనన్యచింతన, అన్నన్యభక్తితో తీసుకునే దీక్షలు ప్రధాన భూమికను పోషిస్తాయి.

వీరు సాత్విక ఆహార ప్రియులు. సాత్వికగుణం కలిగి దయ,కరుణ,జాలి,ప్రేమ భావనలతో సృష్టిలోని ప్రతి జీవియందు సమభావం,కృప,కరుణలను కలిగివుంటారు.

వీరి ప్రవర్తనలలో వాచక అహింస, మానసిక అహింస,శారీరక అహింసపాలన మాత్రమే వుంటుంది. సత్కర్మలఫలంగా స్వర్గలోకంకి ప్రవేశిస్తారు.

స్వర్గలోక ప్రయాణాభిలాషులగా మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులను ఈ రోజే స్వాగతించండి.

* ప్రాతఃకాలంలో పరిశుద్ధమైన మనస్సుతో భగవానుని అనుగ్రహం ఆకాంక్షిస్తూ వారి దివ్య సన్నిదిలో ఓ అరగంట ఉషోదయ ధ్యానముతో దినచర్యను ప్రారంభించండి. ధ్యానం 🧘‍♀️ మీలో మానసిక ప్రశాంతతను తీసుకువస్తుంది.

* మీకు ఇష్టము వచ్చిన స్తోత్రమునో, శ్లోకమునో, మంత్రమునో మనస్సులో స్మరిస్తూ ఆ విశ్వవంభరుడిని కృతజ్ఞత పూర్వకంగా ప్రార్థించండి.

* ఈ ప్రార్థన, ఆరాధన, సమర్పణ కేవలం మీ క్షేమం కొరకు మాత్రమే గాకుండా అందరూ క్షేమంగా వుండాలి, వర్షాలతో సకాలంలో పుడమితల్లి పులకరించాలి, అన్నదాతలు పాడిపంటలతో వారి కుటుంబాలల్లో ఆనందం వెళ్లివిరియాలి, అందరి కష్టాలు తొలగిపోవాలి, అందరి మనస్సుల్లో సుఖసంతోషాలు పొంగి పొరలాలి అని మనఃపూర్వకంగా ఆ అప్రమేయుడిని అంకిత భావంతో వేడుకోవాలి.

* సర్వేజనా సుఖినోభవంతు గా అందరిక్షేమము ఆకాంక్షిస్తూ మనఃపూర్వకంగా ప్రార్థించేవారు శ్రేష్టులు,మానవీయులు,మహనీయులు.

* మనం శుభం జరగాలని మనసా,వాచా,కర్మణా వాంఛిస్తే అదే జరుగుతుంది. ‘యద్భావం తద్భవతి’ అనే వేదోక్తి ఈ సత్యాన్ని ప్రబోధిస్తుంది.

* వేదపారాయణ,వేదాధ్యయనం,సత్ సాంగత్యాలలో పాల్గొనండి. ఆధ్యాత్మికత మీ ప్రవర్తనలో ప్రతిభింభించేలా వుండాలి..


నరకం

ఇది నరకంలోకం. ఇక్కడ సుఖం వుండదు, దుఃఖానికి అంతం ఉండదు.

ఇది ఇతిభాదల ఆవాసం,దుఃఖభరితం, వేదనాభరితం. అందరికీ అయిష్టం అయినది.

ఈ లోకం నరకయాతనలకు, పాపకర్మలకు తెరచి వుంచిన దుర్గంధభరితద్వారం.

యాతనశరీరానికి వీసా అవసరం లేని తెరచివుంచిన,నిష్క్రమణ తెలియని, ప్రవేశద్వారం. ప్రవేశం ఉచితం,

ఇందులో అయిష్టంగా ప్రవేశం చేసే అందరిలో సాత్వికత లేశమాత్రం వుండవచ్చు. రజోగుణం ఎక్కువగా, తమోగుణం పూర్ణంగా వుంటుంది.

వీరు మాంసాహార ప్రియులు. రాక్షసాహారం తీసుకునే వీరు రాక్షసప్రవృత్తితో సృష్టిలోని ఇతర జీవాలు తమ ఆకలి తీర్చుకోవడానికి దేవుడు సిద్ధంచేసిన ఆహారం అనే విపరీతధోరణితో ప్రవర్తిస్తుంటారు.

అహంభావం,అహంకారం,గర్వం,మదం,అత్యాశ వీరి స్వభావంలో అడుగడుగునా కనిపిస్తుంది.

నాది నాదే,నీది కూడా నాదే,అంతా నాదే అనే కబంధహస్తాలతో ఇతరుల ఆస్తులను ఆక్రమించుకుంటారు. అసూయాద్వేషాలతో రగిలి పోతుంటారు.

వీరు జీవితమంతా పగ, ప్రతీకారాలు, కుయుక్తులు, కుట్రలు చేస్తూ, కుతంత్రాలతో రగిలిపోతూ ఇతరుల జీవితాలతో చెలగాటాలాడుకుంటూ వారి జీవితాలను నరకప్రాయంచేస్తూ పైశాచిక ఆనందం పొందే అసురవర్గం.

ఈ అతతాయులకు పరంబ్రహ్మ విధించే శిక్షనే నరకం. ఇది ఆత్మను అధోగతిలోకి పడవేసే విపరీతాకర్షణ శక్తి భరితం.


మర్త్యలోకం.

ఈ మర్త్యలోకం మనందరి ఆవాసం. ఇది అనశ్వరమైనది కాదు. పుట్టిన ప్రతి జీవి నశించే స్వభావం కలిగినది.

ఇది మిశ్రమలోకము. ఇక్కడ సుఖదుఃఖాలు, కష్టనష్టాలు కలగలిసి ఉంటాయి. సుఖదుఃఖములు, కష్ట సుఖాలు రెండూ అపరిహార్యాలే!! అందుకని కష్టాలు, దుఃఖాలు కలిగినపుడు నిరాశ, నిస్పృహలతో కృంగిపోకండి అవి నిలకడలేనివి, రాకపోకలు సాగించేటువంటి సహజ స్వభావం కలిగినవి అని గ్రహించడంద్వారా మనస్సుకు ఉపశమనం కలుగుతుంది. కర్మఫలాలుగా వీటిని అనుభవించవలసిందే!!


వీరు ప్రధానంగా రజోగుణ సంపన్నులు. అహం వారి మాటలలో, చేష్టలలో, ప్రవర్తనలో తొణికిసలాడుతుంది. తమ సంతోషం,కుటుంబశ్రేయస్సు మాత్రమే ముఖ్యం. మానవత్వం చూపించ వలసిన సందర్భాలలో స్వార్థంతో ఆలోచిస్తారు. సంపాదనకోసం ధర్మం,న్యాయంల నుంచి ఎంతకైనా దిగజారుతారు. సంపాదనే జీవితాశయంగా గానుగెద్దులాంటి జీవితం గడిపేస్తుంటారు. సంపాదన కోసం ఇతరులకు హాని కలిగించడం, వారికి ఇష్టం లేని పనులు బలవంతంగా చేయిస్తారు. ఇతరులను క్షోభకు గురిచేస్తారు. దయ, కరుణ అనేవి వీరి డిక్షనరీలో ఎక్కడో సుదూరంగా వుండొచ్చు.

వీరు చేసే పూజలు,ప్రార్థనలు,హోమాలు,క్రతువులు కేవలం తమ స్వలాభానికే.

వీరిలో తమోగుణం ఎక్కువగా,రజోగుణం సాధారణంగా,సాత్విక గుణం స్వల్పంగా ఉంటాయి. భవిష్యత్ జన్మలు వీరి ప్రస్తుత కర్మాచరణ ఫలాలుగా అధమజన్మ లేక నీచజన్మలుగా కూడా వుండగలవు.

ప్రయత్నపూర్వకంగా సాత్విక గుణాలను పెంపోదించుకుంటూ, రజోగుణాలను అదుపులో ఉంచుకోవడండ్వారా విధివ్రాత వీరే తిరగరాసుకోవచ్చు.


మరి కొందరు సాత్వికగుణ మరియు రజోగుణ భావాల సమ్మేళనంతో ఉన్నప్పటికీ వారిలో సాత్విక గుణం మెండుగా ,రజోగుణం తక్కువగా , తమోగుణం అతి స్వల్పంగా కనిపిస్తుంది.

వీరు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటారు.

వీరు వాచక హింస, శారీరక హింస, మానసిక హింసలను ప్రోత్సహించరు, పాటించరు.

దయ, కరుణ కలిగి స్నేహహస్తం అందించడానికి సిద్ధంగా ఉంటారు.

ప్రాపంచిక భోగాలపై మక్కువ 🤞 కలిగి ఉంటారు. కీర్తి, ప్రతిష్టలు, గుర్తింపును కోరుకుంటారు.

వారి పుణ్యకర్మల ఫలితంగా రాబోయే ఉత్తమ జన్మలకు అది వేదిక అవుతుంది.

తమ కర్మాచరణలో మెరుగైన కార్యాచరణతో సాత్విక గుణాలను పెంపొందించుకుంటూ, తమోగుణాలని అదుపుచేసుకుంటూ శాంతియుత జీవన మాధుర్యాలను అనుభవిస్తుంటారు.


నారు పోసిన వాడు నీళ్లు పోయడా అని కొందరు అన్నీ భగవంతుడే చేస్తాడని మనము ఏమీ చేయనక్కరలేదు అని సోమరిగా వుండొచ్చు అనే భావనతో కాలం గడుపుతారు. జంతువులకు కావలసినవన్నీ భగవంతుడు చూస్తాడు కానీ, మానవులకు భగవంతుడు స్వతంత్రంగా ఆలోచించే బుద్ధియిచ్చాడు. ఆ బుద్ధిని ఉపయోగించి యుక్తాయుక్త విచక్షణతో కర్మలను ఆచరించాలి అన్నదే ఆ ప్రత్యగాత్మ అభిప్రాయము.

''జంతూనాం నరజన్మ దుర్లభం'' అటువంటి విశేష మానవ జన్మ పొందిన తరువాత దానిని వ్యర్థము చేయకూడదు. ఆ బుద్ధిని సక్రమముగా వినియోగించు కొనక, కాలము వ్యర్థముచేస్తే పతితుడవుతాడు.


* స్వర్గనరకాలలో దేనిని పొందడానికైనా మార్గం మానవలోకంలోనే వుంది.

* మీ భవిష్యజన్మలు మీరు ఈ జన్మలో మీ పాపపుణ్య కర్మఫలాల ఫలితాలుగా లలాటలిఖితంగా మీరే వ్రాసుకుంటున్నారు. మీ తలరాతలు రాసుకునే అపరబ్రహ్మలు మీరే!


సర్వేజనా సుఖినోభవంతు.


మీ ఆధ్యాత్మిక శ్రేయోభిలాషి

RaNa

9900022729

✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨🧘✨

 
 
 

Comments


bottom of page