భావ తరంగిణి 06
- Admin
- Aug 12
- 1 min read
Updated: Aug 15
అంతరంగ దర్శనం మనకి సాధ్యమవుతుందా ?
పంచతత్వాల సమ్మేళనమే ప్రకృతి. పంచతత్వమయమైన ఈ దేహం అగ్నితత్వంతో విలక్షణంగా ప్రకాశిస్తూ వుంటుంది!
ఆవాసక్షేత్రంమయిన దేహం మన దృష్టికి గోచరించని పంచాగ్నులతో, అగ్నితత్వ మయంగా, శక్తికేంద్రంగా, దేవాలయంగా విరాజిల్లుతోంది!
మనం ఆహారం పరమాత్మకు సమర్పిస్తున్న నైవేద్యంగా భావిస్తూ, ఆ మధురానుభూతితో తీసుకోవాలి. ఆది సాత్వికాహారంగా, మధురాహారంగా, హితాహారంగా, మితాహారంగా కూడా వుండాలి.
భగవత్ప్రసాదితంగా స్వీకరించిన ఆ ఆహారం నోటిలో లాలాజలంతో కలిసి జిహ్వగ్ని అనే యజ్ఞంలో చిన్న చిన్న కణాలుగా విచ్చిన్నం అవుతూ నెమ్మది నెమ్మదిగా జీర్ణాశయంలోకి జారి జఠరాగ్ని అనే రసాయన ప్రక్రియలతో పచనం అవుతూ జీవశక్తిగా కణకణానికి చేరుతూ శరీర ఉష్ణోగ్రతల సమతుల్యతను పరిరక్షిస్తూ వుంటుంది.
అహం వైశ్వనరో భూత్వ ప్రాణి నాం దేహమాశ్రీతః అనే గీతోక్తి ఇదే విషయాన్ని బోధిస్తోంది!
శ్వాసక్రియ ద్వారా ప్రకృతి వరప్రసాదిత ప్రాణవాయువుని వాతావరణం నుంచి గ్రహిస్తూ శ్వాసకోశవ్యవస్థలో ప్రాణాగ్నిలో దహింపబడి, ప్రాణకక్తిగా జీవితక్రియలను సదా నిర్వహించేది హృదయ క్షేత్రంలో వుండే శీతాగ్ని.
ఈ శీతాగ్నియే ఆత్మ. ఆ ఆత్మనే జీవుడు.
జీవుడే దేహదారిగా ఈ స్థూలదేహంతో ఇంద్రియములసముదాయంతో తన కోరికలను, ఇష్టాలను తీర్చుకోవడానికి కర్తవ్యకర్మలను సదా ఆచరిస్తూనే వుంటాడు.
'ఈ స్థూలదేహం కంటే ఇంద్రియమలు బలీయములు, సూక్ష్మములు, శ్రేష్టములు. ఇంద్రియముల కంటే మనస్సు, దానికంటే బుద్ధి శ్రేష్టమైనవి. దాని కంటే అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ ' అని గీతాచార్యులు ప్రబోధ గీతగా బోధించారు.
జ్ఞానాగ్నితో తేజోవంతంగా పరమాత్మ సస్వరూపమైన ఆత్మ అంతరంగంలో ప్రకాశిస్తూ వుంటుంది.
అంతరంగ దర్శనం జ్ఞానసాధన ద్వారానే వీలవుతుంది.
దృడసంకల్పం, శ్రద్ధ, ధీరత్వం, అచంచల విశ్వాసంలతో ఆ జ్ఞానసాధన ఉండాలి.
అనన్య చింతనతో, అంకిత భావంతో, శ్రద్ధాసక్తులతో ఈ ఙ్ఞానసాధన మార్గంలో మొదటి అడుగు వేద్దాం!
సర్వే జన సుఖినోభవంతు
మీ ఆధ్యాత్మిక సేవలో
RaNa
9900022729
Comments